Saturday, May 28, 2016

thumbnail

నీతి శతకము - Nithi Shathakam

నీతి శతకము (164 శతక పద్యాలు మరియు వాటి భావం )


నీతి శతకము

 

అందముగ నుండు పుష్పాల యందు సౌర
భమ్ము లేమియు లేకున్న వ్యర్ధమౌను;
క్రియల శూన్యపు మాటలు కేవలమ్ము
ఇంపుగా నుండు వినుటకే యేరికైన
పుష్పాలెంత అందంగా ఉన్నా సువాసన లేకుంటే వాటి ఉపయోగం లేదు. క్రియా శూన్యపు మాటలు వినటానికి మాత్రమే ఇంపుగా ఉంటాయి.
అందమైన కలలు ఆకాశ హర్మ్యాలు
నిత్యజీవితాన నిజము కావు;
కలల బ్రతుకు లిలలొ కడుచుల్కనౌ గాదె
అట్టి కల్ల కలలో చెడ్డసేయు
అందమైన కలలు గాలిమేడలే తప్ప నిజం కావు. కలలో బ్రతకటం వల్ల మనిషి చులకనైపోవటమే కాక ఆ కలల వల్ల చేటు కల్గుతుంది.
అందరకు నుండుమెట్లైన నండగాను
అంతమాత్రాన పూర్తిగా నందవలదు;
అంది, అల్లంత దూరాన అందనట్లు
మెలగు చుండుట నీకెంతొ మేలుకూర్చు
అందరకు అండగా నుండుట మేలేగాని అందీ అందకుండా ఇతరులతో మెలగటం మరింతమేలు కల్గిస్తుంది.
అందలంబు నెక్కి ఆశయా లన్నింటి
నటకపైన చేర్చుటగునె న్యాయ
మేరు దాటి యెడ్డు చేరిన పిమ్మట
తెప్ప తగులబెట్టు తీరు గాదె?
ఉన్నతపదవి లభించినపుడు ఆశయాలన్నిటిని ప్రక్కన పెట్టుట న్యాయం కాదు. ఏరు దాటిన పిమ్మట తెప్ప తగులబెట్టటం ఇలాంటిదే.
అందుబాటులో నున్నట్టి వన్ని తినుచు
తృప్తి చెందుచు బ్రతికెడి తీరు వలదు;
భుక్తి కోసము బ్రతుకుట ముక్తి గాదు
బ్రతుకుట కొరకు తినుటయే భావ్యమగును
చేతికందిన ప్రతి దాన్ని తింటూ తినటానికే జీవించే పద్దతి మంచిది కాదు. బ్రతుకుటకు తగినంత తింటే చాలు.
అతిధి పూజల చేయని యా గృహస్థు
పితరులకు గల్గు నరకంపు పీడనమ్ము;
అతిధి పూజల జేసిన యాక్షణంబె
సంతసింతురు వారలు స్వర్గగతికి
అతిధి పూజలు చేయని గృహస్థుని పితృదేవతలకు నరకయాతనలు తప్పవు. అతిధి పూజలందిన వెంటనే వారు స్వర్గలోకం చేరి సంతసిస్తారు.
అదుపు నందుంచు టుత్తమమౌను గాదె
తనదు మదిలోని పెరిగిన తామసంబు;
అదుపు తప్పిన ఆవేశ మదియు కూడ
తెచ్చు నాపద  ఎంతైన తెగువ చేయ
తనలో పెరిగియున్న తామసాన్ని అదుపులో నుంచుట మంచిది. ఆవేశం అదుపు తప్పితే ఆ తెగువ వల్ల ఆపద కల్గును.
అన్ని నీకున్న సమయాన అప్పుడపుడు
ఏమియును లేని యున్నప్పు డెల్ల వేళ
నిన్ను వెన్నంటి యుండెడి నేస్త మెవడొ
ఆతడే నీకు నిజమైన ఆప్తు డయ్య!
నీ దగ్గర సంపద ఉన్నప్పుడు అప్పుడప్పుడు, అదిలేనప్పుడు అన్ని వేళలను నిన్ను వెన్నంటి ఉండేవాడే నిజమైన మిత్రుడు.
అన్ని విషయాలు తెలిసిన యట్టివాడు
తనకు కొంచెమైన తెలియ దనును గాదె!
ఏమి యును లేని విస్తరి ఎగిరిపడగ
అన్ని యున్నట్టి విస్తరి అణగి యుండు
అన్ని విషయాలు తెలిసినవాడు తనకేమీ తెలియదంటాడు. అన్నీ వడ్డించిన విస్తరి అణిగి ఉంటే ఏమీలేని (ఖాళీ) విస్తరి ఎగిరెగిరి పడటం లేదా.
అలుపెరుంగక ధనము నెంతైన పేర్చి
దాని నరకొరగా ఖర్చు తడవు సేసి
మూటలను గట్టి పలుమార్లు మురిసిపోవ
నిహపరంబుల సౌఖ్యంబు లెట్లు కల్గు?
విశ్రాంతి తీసుకోకుండా అధికంగా ధనం సంపాదించి దానిలో కొంత మాత్రం ఖర్చు చేసి మిగిలినది మూటకట్టి, దాన్ని చూసి మురిసిపోతుంటే ఈ లోకంలోను, పరలోకంలోను సుఖాలుండవు.
అష్టకష్టాలు పడి పెంచి, అమ్మ యనుచు
తనకు తోడుగ బ్రతుకంత ధారపోయ
సతిని చుల్కన చేసెడి పతి వరేణ్యు
లెంద రెందురొ లెక్కింప నేరి తరము?
అమ్మ అష్టకష్టాలు పడి తనను పెంచినదని చెపుతూ జీవితాంతం తనకు తోడుగా నుండు భార్యను చుల్కన చేసెడి భర్తలెందరో లెక్కింపజాలము.
అహము నిండ, మంచి ఆలోచనలు రావు,
మనసు వికలమగును, మదము హెచ్చు;
తాను దూరమౌను, తనవారి నుండియే
ఏవగింపబడును, హీను డౌను
అహంభావికి మంచి ఆలోచనలు రావు. మనసు వికలమౌతుంది. మదం పెరుగుతుంది. తాను దూరమవుతూ తనవారి చేతనే అసహ్యింపబడి హీనుడౌతాడు.
అహము మితి మీరినందున నపజయమ్ము
తప్ప దేనాటికైనను తరచి చూడ;
అన్నిటికి నేనే యనెడి యా యహము వీడి
అనువెరింగి వర్తించిన యాధికుండు
అహంభావం మితిమీరితే అపజయం తప్పదు. అహం వీడి ప్రవర్తించటమే ఉచితం.
ఆగడాలు చేసి అల్లరిపాలౌచు
దూరమగుట చూడ ఘోరమౌను
ఆప్తజనుల జేరి అభిమాన మొందుటే
నీకె శ్రేయమగును నిక్కువముగ
చెడుపనులు చేసి తనవారికి దూరమగుట మిక్కిలి ఘోరము. ఆప్తులైనవారి అభిమానము పొందుటే శ్రేయోదాయకము.
ఆడుదానికి నెటువంటి యందమున్న
అప్సరసలను మించెడి ఆకృతైన
ఆమె వివరాలు తెలియని యంతవరకు
గుంభనంబుగ భావింప కూర్మి యగును
అప్సరసలను మించిన అందముకల స్త్రీ ఎడల, ఆమె పూర్తి వివరాలు తెలియనంతవరకు గుంభనంగా ఉండటం మంచిది.
ఆపదలు కల్గినపుడె యందరకును
భక్తి భావంబు హెచ్చుగ వ్యాప్తి చెందు;
అట్టి యాపద దాటిన యాక్షణంచె
దైవమును మర్చిపోవు కృతఘ్నుడెపుడు
కష్టాలు కల్గినపుడే అందరికి దైవభక్తి ఏర్పడుతుంది. ఆ కష్టాలు తొలగగానే దేవుని మర్చిపోతుండటం వల్ల కృతఘ్నుడౌతాడు.
ఆలు బిడ్డల పోషింప చాలినంత
ధనము కంటెను యధికమే తానుగూర్చి
నట్టి పైకాన, రవ్వంత యైనగాని
సతతసత్కార్యములు జేయ హితము గాదె?
భార్యాబిడ్డలను పోషించటానికి చాలిన దానికంటె ఎక్కువగా సంపాదించిన పైకంతో కొంతైన మంచి పనులు చేయటానికి ఉపయోగించు
ఆలు మగలను విడదీయు టమిత సులువు,
అన్నదమ్ములు విడిపోదు రెన్నడైన,
ప్రాణ మిత్రుల విడదీయు పనిభరమ్ము;
అఖిలజను లెరుంగుదురీ దుఘనాను భవము
భార్యాభర్తలను, అన్నదమ్ములను విడదీయగలం కాని ప్రాణస్నేహితులను విడదీయుటెంతో కష్టం.
ఇష్టమైనది ఎటువంటి కష్టమైన
స్వల్పకృషితోడ నేరీతి సాధ్యపడును?
కృషి మొనర్చుటనునది ఋషుల కైన
తప్పలేదని ఎరుగుము ధరణియందు
కొద్ది కృషితో కష్టమైన పనులు చేయుట అసాధ్యము. ఋషులకు సైతం ఎంతో కృషితో తపస్సు చేయుట తప్పలేదు.
ఉండు యజమాని కహమెంతొ మెండుగాను
అదరగొట్టును పనిచేయుడంచు పరుల;
అహము పోద్రోల, పనుల దుస్సహము లైన
పొనర జేతురు పనివాండ్రు ముదము తోడ
పనిచేయండి అంటూ సేవకులను యజమాని భయపెట్టట్టానికి కారణం అతనిలోని అహంభావమే. ఆ అహం అతడు వదిలిపెడితే మరింత సంతోషంతో పనివాళ్ళు కష్టమైన పనులు కూడా సాధిస్తారు.
ఉన్నతంబగు పదవితో నున్న యపుడు
మనసు నందలి భావాలు మట్టుపరిచి
సద్గుణాలకు రాసియై చతురమతిని
మేలమాడుచు తంత్రాన మెలగవలయు
ఉన్నత పదవిలో నున్నవారు తమ మనసులోని భావాలు బయట పడనీయక, చతురోక్తులతో మెలుగుచు తోటి వారిచే మంచి వాడనిపించుకొని మసలాలి.
ఉన్నతస్థితి లోన నీ వుండినపుడు
సాయపడు మితరులకునీ శక్తి కొలది;
వారిలో గల నైపుణ్య సారమెరిగి
ప్రోత్స హింపుము వారెల్ల పొంగి పోవ
ఉన్నతస్థితిలో ఉన్నప్పుడితరులకు శక్తికొలది సాయం చేయాలి. ఇతరుల నైపుణ్యాన్ని పరిశీలించి ప్రోత్సహిస్తే వారు సంతోషిస్తారు.
ఎండు మొక్కల బ్రతికింప నెవ్వరైన
పచ్చనైనట్టి వానిని పెచ్చరిల్లి
పీకబూనుట ఎటువంటి సాకు యగును?
పిల్లి చెలగాట మెలుకకు ప్రీతిగాదు
ఎండిపోయిన మొక్కలను బ్రతికించాలనే సాకుతో పచ్చని మొక్కల పీకటం, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం లాంటిది.
ఎటుల బ్రతికితి మన్నదే యేరికైన
లక్ష్యమౌటయె మానవ లక్షణంబు
వ్యర్ధమౌనట్టి బ్రతుకు నిరర్ధకంబు
కాకి నూరేండ్లు బ్రతుకుట గనమె మనము?
ఏ విధంగా బ్రతికామనే లక్ష్యముంచుకొనుట మానవుని ధర్మం. కాకి వలె నూరేళ్ళు బ్రతుకుట వ్యర్ధం.
ఎట్టి కష్టా లొకే పరి ఏర్పడినను
గుండె నిండుగ ధైర్యమ్ము గూర్చవలయు;
పిరికి పందగ నుండుట పెద్ద లోప
మట్టి వానికి నపజయ మౌట రూఢి
కష్టాలొక్కుమ్మడిగా వచ్చినపుడే ధైర్యంగా వాటినెదుర్కోవాలి. పిరికి పందగా నుండే వాడికి అపజయం తప్పదు.
ఎట్టి బాధలు కటువుగా నేర్పడినను
యున్నతపు లక్ష్యమే మది యుండినపుడు
కష్ట భూయిష్ఠ మనిపించు గమన మీపు
ఏటి కెదరీది పనులు సాధించుకొమ్ము
ఉన్నతమైన లక్ష్యం మనసులో ఉంటే ఎన్ని బాధలు కల్గినా కష్టాలన్నింటినీ ఎదురీది జయము సాధించుకోవాలి.
ఎట్టి యవమానములు పరు లెన్ని యేని
సల్పుచున్నను భరియింప జాలు మనసు;
సన్నిహితులైన వారల సున్ని తంపు
ప్రేమ భరియింప జాలద దేమి వింత!
ఇతరులెన్నివిధాల అవమానించినా భరింపగల్గేవారు. తనకు సన్నిహితులైన వారల ప్రేమను భరించలేకుండుటయే ఓ వింత!
ఎట్టి యాపద మిత్రున కేర్పడినను
స్నేహ ధర్మంబు పాటించు నేస్తుడెపుడు
ఆపదబ్ధిలో దూకి కాపాడు కాని
లెక్క చేయడు ప్రాణంబు లేశమైన
స్నేహితుడెప్పుడు మిత్రుని ఆపద తీర్చాలని ప్రయత్నిస్తాడు. ప్రాణాన్ని లెక్కచేయక ఆపద అనే సముద్రంలో దూకి కాపాడతాడు.
ఎట్టి యాపద లందైన ఎదురు నిల్చి
బయట పడగల్గుటే నీకు భావ్యమగును;
తీరెరింగిన పిమ్మట తెంపు చూప
జయము లభియించు నీకు; నిశ్చయము సుమ్ము
ఎట్టి ఆపదల నుండియైన బయటపడగల్గుటే మంచిది. తగిన సమయంలో తెంపు చూపితే నిశ్చయంగా జయం లభిస్తుంది.
ఎట్టిపనియైన నాలస్య మేమిలేక
తలచినంతనె శ్రద్ధతో తక్షణంబు
చేయ బూనుట మిక్కిలి క్షేమకరము;
ఆలసించిన విషమౌను యమృతంబు
ఆలస్యం చేయకుండా తలచిన పనిని శ్రద్ధతో చేయుట మిక్కిలి క్షేమం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమౌతుంది.
ఎట్టిపనులు లేక ఏడాది యంతయు
సెలవలంచు గడుప సేమమగునె?
పనులు చేయకుండ బ్రతుకంత సోమరై
మునిగి తేలుచుంట ముప్పు తెచ్చు
సంవత్సరంలో ఎక్కువకాలం సెలవులంటూ పనిచేయకుండటం మంచిది కాదు. అట్టివాడు జీవితాంతం సోమరిగా మారటం వల్ల కీడు ఏర్పడుతుంది.
ఎదుటివానికి నెపుడైన నొదవు సుఖము
తనదియే యంచు మదిలోన తలచు వాడు;
ఎదటి దుఃఖము సైతము ముదము కాగ
తలచి యాతని నోదార్ప వలయుగాదె?
ఎదుట వాని సుఖమే తన సుఖమని తలచే నరుడు, అతని దుఃఖము కూడ తనదే యని తలచి ఆతని నోదార్చాలి.
ఎన్నడైనను దైవంబు నెరుగ కుండ
కష్ట మందె తా స్మరియింప కనిన యంత
ఎల్ల వేళల మానవుల హీన భక్తి
దైవమును గొల్చు చుండుట ధర్మమౌను
కష్టాలు వచ్చినపుడే దైవాన్ని స్మరించే బదులు ఎల్లవేళల దైవాన్ని కొల్చుట ఎంతో మేలు.
ఎన్ని చట్టములలో నున్నగాని,
చెడ్డవా రెల్లవేళల సిగ్గు మాలి
చట్టముల కెదురీతకే సాహసింప
సంఘ నియమాలు దాటరు సజ్జనాళి
చెడ్డవారు ఎల్లప్పుడు సిగ్గువిడిచి చట్టాన్ని ఎదిరించటానికి సిద్ధపడతారు. మంచివారు సంఘనియమాలు దాటరు.
ఎన్నియోసార్లు నేలపై నెంత పడిన
మరల లేచుటే నరునకు మార్గమౌను
స్వారి చేసెడి రౌతు తా జారి పడిన
సడల సేయునె కళ్ళెంబు సాహసాన?
నేలపై పడిన నరుడు మరల మరల లేచి నిలబడాలని ప్రయత్నిస్తాడు. రౌతు గుర్రంపై నుండి జారిపడినా చేతిలోని కళ్ళేన్ని సడలనీయడు.
ఎరుగలేడు పురుషు డిల్లాలి వైఖరి
పెండ్లి కాకముందు, బెరుకు వలన;
పెళ్ళి పిదపకూడా పెండ్లాము ధోరణి
అతడెరుగకుంట నదియె వింత
పెళ్ళి కాకముందు వధువు స్వభావం వరునకు తెలియదు. పెళ్ళైన తర్వాత కూడా ఆమె స్వభావం అతడెరుగ లేకుండటం ఎంతో విచిత్రం.
ఎల్ల విషయాలు గ్రంధాల నెన్నొ చదివి
విపులవిజ్ఞాన మార్జింప విలువ లేదు;
ఆర్జిత జ్ఞానమంతయు నను భవాన
నన్వయించిన గల్గు మహా ఫలమ్ము
అనేక గ్రంధాలు చదివి జ్ఞానం సంపాదిస్తే చాలదు. జ్ఞానమంతా అనుభవంతో ఆచరించి చూపాలి.
ఎల్లజనులు పూని ఏకాకిగా నిన్ను
చేసినందు వలన చింత వలదు
కాకతము కంటె కోకిలొక్కటి చాలు
కావ నిన్ను నేస్తగాడు చాలు
జనులందరు చేరి నిన్ను ఒంటరిగానిని చేసినంత మాత్రాన దిగులు పడొద్దు. నూరు కాకులకంటే, కోకిల లాంటి మిత్రుడు నీకండగా నుంటే చాలు.
ఎవరికైనను ప్రేమించు టెంతో సులువు
అంతమాత్రాన శాశ్వత మౌనె ప్రేమ?
త్యాగనిరతిని గోరు సత్యమగు ప్రేమ
యట్టి త్యాగధనుల ననుసరించు
ఎవరినైన ప్రేమించటం చాలా సులువే. అటువంటి ప్రేమ శాశ్వతం కాదు. త్యాగధనుల మార్గాన్ననుసరించుటయే నిజమైన ప్రేమ అవుతుంది.
ఎవరు ఆశల నదుపులో నుంచగలరొ
అట్టివారు నిరీహు లియ్యవని లోన;
నైతికంబుగ దిగజారు నట్టివారు
పతన మౌదురు, సందేహ పడగనేల?
ఆశలనదుపులో ఉంచటం ఎంతో అవశ్యం. నైతికంగా దిగజారువారు నిశ్చయంగా పతనం అవుతారు.
ఎవరు కష్టించి యున్నతి నెట్టులైన
తమకు తాముగ సాధించ దలచినపుడు
కల్గు విజయంబు వారికే కరణినైన;
ఎట్టి శ్రమయైన వృధయౌనె యిజ్జగాన?
కష్టపడి ఉన్నత స్థితికి రావాలనుకొనే వారికి తప్పక విజయం లభిస్తుంది. కష్ట మెన్నటికి వృధాకాదు.
ఏటిలో చేపకైవడి నీదగలడు
గగన మందున పక్షియై ఎగురగలడు,
ఏమి వైచిత్రమోగాని భూమిపైన
మనిషి మనిషిగా మనుటయే మరచినాడు
నీటిలో చేపవలె ఈద గల్గటం, ఆకాశంలో పక్షివలే ఎగరగల్గటం తెలిసిన మనిషి భూమిపై మానవునిగా బ్రతక లేకపోవడం ఎంతో విచిత్రం
ఒక్క వాక్యము నెవరైన నొక్కి చెప్ప
దానియందు గుణాగుణ వైన మెరిగి
గుణము గ్రహించి, దోషమ్ము కొట్టివేత
తగిన సంస్కృతి నీదంచు తలచు మెపుడు
ఎవరైన ఒక్క మాట చెప్పగానే దాని యందలి గుణము మాత్రమే గ్రహించి, దోషాన్ని వదిలివేస్తే సంస్కారవంతుడవౌతావు.
ఒక్క విషయంబు పలుసార్లు నొక్కి చెప్పి
భోధ చేసిన పెరుగునే బుద్ధిబలము?
చేరుకొనుటకు గమ్యంబు శీఘ్రగతిని
చూపుమెట్లైన చేతల, సులభరీతి
ఒకే విషయం పదేపదే బోధించినంత మాత్రాన బుద్ధిబలం పెరగదు. శ్రీఘ్రంగా గమ్యం చేరుకోటానికి సులభమైన పద్దతి చూపుటే ముఖ్యం.
ఒక్కసారిగ పనులన్ని మిక్కుటముగ
వచ్చి పడినంత తడబాటు వలదు నీకు,
పనుల ప్రాధాన్యతా క్రమమను సరించి
చక్క బెట్టు కొనుము నీవు చతురగతిని
అనేక పనులు ఒక్కసారే చేయాల్సివస్తే తడబడవద్దు. వాటి ప్రాముఖ్యతననుసరించి వరుసక్రమంలో పూర్తిచేసే చతురుడవు కావాలి.
కక్షసాధింపు చర్యల కారణాన
శత్రువైనట్టి నానిని సత్వరంబు
పిలిచి, కవ్వింపు చర్యలు సలుపనంచు
చేయు మొకసంధి యాతని చెలిమిగోరి
కక్ష్య సాధించే తలంపుతో శత్రువైన వానిని, పిలిపించి కవ్వించే పనులు చేయనని తెల్పుతూ అతనితో స్నేహపూర్వక సంధి చేసుకోవాలి.
కష్టముల దీర్ప ప్రార్ధింతు రిష్టదైవ
తమును పలుమార్లు మ్రొక్కులు తామె మ్రొక్కి
వ్యాజ రహితమౌ నిక్కంపు భక్తి తోడ
అసలు సిసలు భక్తుడు దేవు నవధరించు
కష్టములు తీర్చమని పదేపదే దేవుని మ్రొక్కుటకంటె నిష్కల్మషమైన భక్తితో దేవునారాధించుటయే నిజమైన భక్తుని లక్షణం.
కష్టమెప్పు డు నొకరికే కల్గునంచు
ఖేదమందును, భీరువు బాధ చెంది;
ధీరుడౌ వ్యక్తి కష్టాల భారమెల్ల
ఒంటిచేతనె దానిని మంటగలుపు
పిరికివానికి కష్టము గల్గినపుడు ఆ బాధతో తన ఒక్కనికే కష్టం వచ్చిందని దుఃఖిస్తాడు. ధీరుడైనవాడు ఒంటిచేత్తో కష్టాల నవలీలగా దాటగల్గుతాడు.
కాల హరణంబు చేసిన కతన నీకు
కష్టతరమౌను సులువైన కార్యమైన;
శీఘ్రగతి కార్యము లొనర జేసితేని
కష్టమిసుమంతయైన నీ కడకు రాదు
ఎంత సులభమైన పనియైనా కాలయాపన చేస్తే కష్టతరంగా మారుతుంది. సాధ్యమైనంత త్వరగా పనిపూర్తియైతే ఏ కష్టము తెలియదు.
కీడు చేసిన వారెల్ల కేలు మోడ్చి
తాము చేసిన తప్పులు తలగ విడువ
ఎట్టి ప్రతీకారము ల్సేయకే తదీయ
శత్రుభావంబు విడనాడి సల్పుమైత్రి
నీకు హాని చేసినవారే నీ ఎదుట చేతులు జోడించి తాము చేసిన తప్పులు ఒప్పుకొంటే వారిపై శత్రుభావము విడిచి పెట్టి ఏ ప్రతీకారము తలపక వారితో మైత్రి చేయుము.
కీడు పోద్రోలి మేలు కల్గించు మంచు
దైవమును వేడుకొనెడి కొంద రిల యందు
అటులనే గోరి ప్రార్ధించు నన్యజనుల
ఈసుతో జూచి కలుషించు టెంత వింత!
తమకు కల్గిన ఇబ్బంది పోగొట్టుమని దేవుని ప్రార్ధించేవారు అదే విధంగా ఇతరులు ప్రార్ధిస్తుంటే వారిని చూచి అసూయపడటం ఎంతో వింత?
కొన్ని వసతుల నింటిలో గూర్చు కొరకు
బాధపడబోకు లోటుగ పైకమున్న
సంతసించుము తిండికి చాలినంత
దేవుడిచ్చెను నా కంచు తృప్తి తోడ
తగిన పైకం లేదని, తగిన వసతులు ఏర్పడలేదని బాధ పడకూడదు. తినటానికి తగినంత దేవుడిచ్చాడని తృప్తిపడాలి.
కోపగుణమది కూడదు కొంచెమైన
కోపమేనాటికైనను శాపమౌను,
అట్టి కోపము రంగాన యువతరింప
తెర మరుంగగు మనుజుని తెలివియంత
కోపమెన్నటికీకూడదు. అది యొక శాపమే. అట్టి కోపము బయటపడితే తెలివితేటలు తెరవెనక్కుపోతాయి.
కోపమున్న, ఘనత కొంచెమై పోవును
కళ్ళు మూతబడును, ఒళ్ళు మరచి
అతిగ ప్రేలుచుంట మతి యంత శూన్యమై
నరుని పతనమునకు నాందియౌను
కోపగుణముంటే గొప్పవాడు కాలేడు. కళ్ళు మూతబడుతాయి. ఒళ్ళుమరిచి ప్రేలటంతో మతిపోయినవాడౌతాడు. ఈ విధంగా పతనం చెందటానికి కోపమే కారణం.
కోరికలు నరున కేమియు కూడవంచు
యట్టి కోర్కెల మదిలోన నణచు కొనిన
ఎట్టి జీవిత లక్ష్యంబు నెరుగ నేర
డతడు బ్రతుకుట వ్యర్ధమే యనరె జనులు
ఏ కోర్కెలు ఉండకూడదని మనసులోనే కోర్కెలనణచి వేయరాదు. ఏ జీవిత లక్ష్యం లేని వాడు బ్రతకటం వృధాఔతుంది.
కోరుదురు ప్రతి ఒక్కరు కూర్మితోడ
తామె ఏలికగా నుండ తగుదుమంచు
అందరేలికలైన యా యందలంబు
లేవ దెవ్విధి బోయీలు లేక; నిజము
ప్రతివాడు తాను ఏలికగా నుండాలని కోరుతారు. అందరూ ఏలికలైతే పల్లకి నెత్తే బోయీలుండరు.
క్రొత్త ఆలోచనల చేయగోరువారు
తమకు కల్గెడి విఘ్నాలు తలచుకొనక
కార్యసాధన వలననే ఘనత యనుచు
అడుగు ముందుకు వేయుటె అధిక ఫలము
విఘ్నాలు కలుగుతాయని క్రొత్త ఆలోచనలు చేయటం మానకుండా, ముందడుగు వేసి తాము చేయదలచినది సాధించటమే ఘనతనిస్తుంది.
గడ్డి వెంటిగ నేర్పడి గజము గట్టు;
కలసి యున్నంత కాలమే నిలువగలము
కలువకుండుట వలననే బలము తగ్గు,
ఐకమత్యమె ప్రజకు మహా బలమ్ము
గడ్డి వెంటిగా ఏర్పడి ఏనుగును బంధిస్తుంది. ఐకమత్యమే మహాబలం అని తెలిసికోవాలి.
గడ్డికంటెను హీనంబుగా తలంచి
తమకు తామెంతయో కడు తపన చెంది
అణుకువ నుందు రున్నతు లవని లోన
నిండు కుండలు తొణకునే నీటి తోన?
ఉన్నతస్థితి ఉన్నవారు తమను తామెంతో తక్కువగా అంచనా వేస్తారు. నీటితో నిండియున్న కుండ ఎప్పుడూ తొణకదు.
గడ్డివామిని దగ్ధంబు గాగ నగ్గి
పాలు చేసిన, నేలయు భస్మమగునె?
ఎన్నిమార్లైన తనలనే వెక్కిరింప
ఆగ్రహించునె యున్నతు డైనవాడు?
గడ్డివామిని దగ్ధము చేసినంత మాత్రాన అక్కడి నేల భస్మమవదు. అట్లే ఉన్నతుడైనవాడు తనని ఇతరులు గేలిచేసినా ఆగ్రహింపడు.
గమ్యమును చేరవలెనని కదలకుండ
ఎంతసేపైన నిలువగా నేమి ఫలము?
కోరదలిచిన గమ్యమ్ము కొరకు నడువు
మడుగులను వేసి లక్ష్యంబు నధిగమింప
ఉన్న చోటనే నిలబడి గమ్యం చేరాలంటే ఫలితముండదు. గమ్యస్థానం చేరటానికి ఒకదాని వెంట మరో అడుగు వేస్తూ పోవాలి.
గాలి వీచెడు దిశవైపు కదలు విస్త
రాకు రీతిగ హృదయ మారాట పడుట
కాక, మనసు మాత్రము ముక్తి కాంక్ష తోడ
ప్రభుని సన్నిధి నారాటపడుట లెస్స
గాలి ఎటువీస్తే ఆ దిశగా మారే విస్తరాకు వలె హృదయం ఆరాటం చెందుట కంటె, ముక్తి మార్గం పొంది దేవుని సన్నిధి ఎలా చేరాలో అని ఆరాట పడటం మంచిది.
గుర్రముల రీతి తనలోని కోర్కెలన్ని
పరుగులిడినను జీవితపధము నందు
చింత చెందును, కోరిక లెంతమాత్ర
మైన తీరకుండుట చేత మానవుండు
తనలోని కోర్కెలు గుర్రాల వలె పరిగెత్తుతుంటే, ఆ కోరికలు తీరవు. ఆ చింతలతో అతని కోర్కెలెన్నడూ నెరవేరవు.
గొప్పతనమును, పరువును గోరువాడు
గొప్పకాలేడు పదవితో కూడినంత;
డాబు, దర్పంబులను వీడి ధర్మబుద్ధి
మసలుకొన్నప్పుడతనికి మంచి గల్గు
పదవితో ఉన్న ప్రతివాడు గొప్పవాడు కాదు. డాబుదర్పము వదిలి సక్రమంగా మెలగితే మంచివాడవుతాడు.
ఘనుడు కాలేడు అధికారగర్వమంది
హద్దుమీరుచు నాతడే ఆజ్ఞసేయ;
పైడి సింహాసనమ్మున పాడుకుక్క
కూర్చొనిన మాత్రమున నెట్లు గొప్పదౌను?
అధికార గర్వంతో హద్దుమీరి ప్రవర్తిస్తే ఎవరూ ఘనులు కాలేరు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండ బెట్టితే అది గొప్పదవుతుందా?
చదువగావలె పొత్తాలు సంగ్రహాన
చదివినంతనె యౌనవి సహజనేస్త
మట్టి పుస్తకములు లోని గుట్టునంత
చదువ నయ్యవి మిత్రులై ఎదుట నిల్చు
ఎన్నో పుస్తకాలు సంగ్రహంగా చదివినంతనే అవి స్నేహితులవలె మారుతాయి. ఆ పుస్తకాల్లోని సారమంతా క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే అవే మిత్రులవలె ఎదుట నిలబడినట్లుంటాయి.
చదువు జాస్తియైన చాదస్త మెక్కువై
పిచ్చి పట్టు ననెడి రచ్చ వలదు;
విద్య పెల్లులేక విద్వాంసు డెట్లగున్‌?
జ్ఞాని గాక నెవరు గౌరవించు?
చదువెక్కువైతే చాదస్తం ఎక్కువై పిచ్చిపట్టుతుందనే వాదం మానెయ్యి. అధిక విద్యలేనిదే ఎవరూ విద్వాంసులు కాలేరు. అట్టి జ్ఞానినే ఎవరైనా గౌరవిస్తారు.
చిన్నదైనను పొరబాటు చేయరాదు
కొలది నిర్లక్ష్యమే ఇల కొంపముంచు;
పెద్ద యోడను ముంచంగ ప్రిదిలిపోవ
సన్నరంధ్రంబు చాలదే? సంద్రమందు
ఎంత చిన్నపొరబాటు వల్లనైనా ఒక్కోసారి కొంపలు మునిగే ప్రమాదముంది. సముద్రంలో ఓడ మునిగిపోటానికి చిన్న బెజ్జంచాలదా?
చెంత నిష్టులు లేకున్న నింతి తాను
క్షణము యుగముగా నెంచి వీక్షణము జేయు;
చేరి ప్రియమైన వారలు చెంతనుండ
యుగము లామెకు క్షణములే యగును గాదె
ఇష్టమైన వారు దగ్గర లేకుంటే స్త్రీలకు క్షణమొక యుగంగా ఉంటుంది. ఇష్టులతో నున్నపుడు యుగాలన్నీ క్షణాల్లో గడిచిపోతాయి.
చెడ్డజనుల గుంపు చెలరేగినప్పుడు
సంస్కరింప నెట్లు సాధ్యపడును?
సాధుజనుల పరమ సాత్విక బుద్ధిచే
వారి సంస్కరింప వచ్చు సుమ్ము
చెడ్డ జనం ఒక్కసారి చెలరేగితే వారిని సంస్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. సాధు జనుల సాత్వకతత్వంతో వారినేవిధంగానైనా మార్చవచ్చు.
చేత అధికారమున్నంత సిగ్గుమాలి
పదవికే మచ్చ దెచ్చెడు పనులు జేయు
నట్టివానిని గమనించి యతని లోని
నీచవైఖరి మానంగ నేర్పవలయు
అధికారం ఉన్నది గదాయని సిగ్గువిడిచి ఆ పదవికే మచ్చతెచ్చే పనులు చేసే వాని నీచస్వభావం మాన్పటానికి యత్నించాలి.
చేయ జూతురు సుఖమునే చెందుకొరకు
జతనములు పెక్కువిధముల జనము సతము;
మనసునదుపున బెట్టెడి మార్గమెదియొ
నట్టి దారిలో గమియింప రరసిచూడ
సుఖపడాలని ఎన్నో విధాల జనం యత్నిస్తారు. కాని మనసునదుపులో పెట్టే మార్గంలో నడవటానికి ప్రయత్నించరు.
చేయపని నందరు ప్రశంసింపవలయు
నంచు తహతహలాడెడి నరుని చేరి
తాన తందాన యంచు నెంతైన బల్కు
బృందముల గాంచి సంతస మందగలమె?
తాను చేయు పనిని అందరూ మెచ్చుకుంటూ తాన తందాన అనే బృందాల వల్ల సంతోషపడటం మంచిది కాదు.
చేయబూనిన కార్యంబు చేయు కొరకు
వెనుక ముందాడు చుండుట వెరవుగాదు;
తలచినప్పుడె పనిచేయ తగును నీకు
కాలహరణ మేమాత్రము మేలుకాదు
ఎదైనా పని తలపెట్టి చేయునపుడు తటపటాయించుట కూడదు. కాలం వ్యర్ధం చేయటం మేలు కాదు. తలచిన పని వెంటనే చేయుటే నీకు మంచిది.
చేయబూనిన పనియందు చిక్కులున్న
సాధ్యపడదంచు దానిని సగము నందె
మానివేయుట తగదెట్టి మానవునకు
యత్నపరుల కసాధ్యంబు లవని లేవు
ఒక పని చేయాలనుకొంటే దానిలో ఇబ్బందులున్నాయని సగంలో వదిలేయకూడదు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు.
జయము కోరితివేని నీ భయము వీడి
సూటియైనట్టి మార్గమే చూచుకొనుము;
నూరు విధముల యత్నించు తీరు గలుగ
నపజయమ్ములు కూడ నూరౌట నిజము
సత్యమైన మార్గాన్ని ఎంచుకొంటే జయము నిశ్చయము అనేక విధాల ప్రయత్నిస్తే ఒక్కోసారి అపజయాలు కల్గవచ్చు.
జయము సాధించ దలచిన, జంకులేని
నరుని నెదిరింప నేరికి తరము గాదు;
తగిన సంకల్ప శక్తియె తనకు లేక
యున్న, నపజయ మబ్బదే ఎన్నడైన?
జయం పొందటానికి ఏ విధంగాను జంకనివాని నెవరు ఎదిరింపలేరు. దృఢమైన సంకల్పబలం లేని వానికి అపజయమే తటస్తిస్తుంది.
జీవితంబును మెరుగుగా జేసికొనుట
తమకు చేతగాదనియెంతొ తల్లడిల్ల
సర్దుకొని బోవ జూచెడి సాత్వికుల
దారియే ప్రజలెల్ల నా ధర్మమగును
జీవితం సుఖప్రదం చేసికోటం చేతకాలేదంటూ తల్లడిల్లుతూ ఉండేవాడు. సాత్వికులవలె సర్దుకొని పోగల్గితే ఆ దారి ప్రజలందరికీ ఆదర్శమార్గమౌతుంది.
తనకు సమయంబు మిక్కిలి తక్కువైన
నటన చేయును తెరపైన నటుడు తాను
బ్రతుకు కడదాక నటియించు, భారమైన
కాలపు విలువ నంతయు కూలద్రోసి
సమయం తక్కువైన కొద్దికాలంలోనే నటుడు తెరపై నటిస్తాడు. అమూల్యమైన కాలం విలువ తెలియనివాడు జీవితాంతం నటిస్తాడు.
తనదె తప్పని తెలియగా తలను వంచి
ఒప్పుకొనువాడు ధరలోన నున్నతుండు;
తప్పు తనదంచు తెలిసియు నొప్పు కొనక
గడుసుతనమున తిరుగుట ఘనత యౌనె?
తన తప్పు తానె తెలిసికొన్నవాడు గొప్పవాడు. తప్పు తెలిసియు గడుసుతనంగా మెలగటం గొప్పగాదు.
తప్పు చేసినపుడు తగని వంకలు చూపి
కప్పిపుచ్చుకొనగ కల్గు చేటు;
తప్పు చేసి నీవు తప్పించు కొనవద్దు
దాని దిద్దుకొనుట ధర్మమౌను
చేసిన తప్పు కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తే చేటు కల్గుతుంది. చేసిన తప్పు దిద్దుకోటమే నీ ధర్మము.
తలచినంతనె పనులు సత్వరమె జేసి
చివరి నిమిషాన నేర్పడు చేటు దాట,
మరల మరలను యత్నించు మనుజు డెపుడు
విజయసోపాన పథమున విక్రమించు
తలచిన వెంటనే పనులను పుర్తిచేయువాడు చివరి నిమిషాన ఏర్పడు ఆటంకాలు నధిగమించి విజయం పొందుతాడు.
తలచినది ఎల్లవేళల తప్పకుండ
జరుగు టనునది భ్రమయని ఎరిగికూడ,
కలలనైనను నెన్నడు దలపనట్టి
జయము సాధించినంత విస్మయము గల్గు
తలచినదంతయు జరుగుతుందనే భ్రమకూడదు. కాని కలల్లో సైతం ఊహించని విజయం లభిస్తే ఎంతో ఆశ్చర్యమౌతుంది.
తల్లి యైన నీ పైననే దయను చూప
నట్టి పుత్రుని యండకై ఆశపడకు;
కుసుమ, ఫలముల, నీడల నొసగలేని
చేవలేనట్టి చెట్టుకై చింతయేల?
తల్లి పైన దయ చూపని పుత్రుని అండకై ఆశపడరాదు. పూలు, పళ్ళు, నీడ ఈయలేని చెట్టుకై చింతించడమెందుకు.
తాను చేసిన పనితోడ తనివి చెంది
ఎల్లవారల పొగడ్త హితమటంచు
తగని యారాటపడువాని తత్వమెంతొ
పలుచబరచును, వానినే పగిదినైన.
తాను చేసిన పనికి తృప్తి చెంది, అందరూ పొగుడుతుంటే పొంగిపోతూ ఆరాటపడేవాడు. ఏవిధంగానైనా చులకనౌతాడు.
తాను తలచిన దంతయు తప్పకుండ
ఆచరించుటే యనుసార్య మవనిలోన
విఫలమౌనేమొయని దాని వీడవద్దు
పట్టుదల సడలింత వైఫల్యమగును
తాను అనుకొన్నది వెంటనే చేసి తీరాలి. విఫలమౌతాయని మనం వదిలిపెడితే పట్టుదల సడలి అపజయం కల్గుతుంది.
తాను నేర్చినదంత విద్యార్ధులకును
నేర్ప యత్నించు సద్గురు డోర్పు మీర;
దివ్వె తావెల్గి, మరికొన్ని, దీపములను
వెలుగ జేయుగదా! కాంతి కలితముగను;
తనకు తెలిసినదంతా శిష్యులకు నేర్పటానికి గురువు ప్రయత్నించాలి. దివ్వె తాను వెలుగుతూ మరికొన్ని దివ్వెలు వెలుగ చేసి కాంతినిస్తుంది కదా?
తెలిసికొనలేని దేవుని తలచినంత
నిల్చిపోవును పాపసముచ్చయంబు
లన తెలిసికొని జేయు పూజాధికములు
కాంచ జేయవె పుణ్యా సంక్రమణ పధము
దేవుని తలచినంత మాత్రాన పాపాలన్ని హరిస్తాయి. దైవ పూజల వలన ఎంతో పుణ్యం లభించటం నిస్సందేహం.
తొలగ ద్రోయుట సులభంబు మలినములను
బాహ్య దేహాన పేరిన వైన యెడల;
అంతరంగాన దిటవుగా నలముకొనిన
మలినరాసిని తొలగింప గలమె మనము?
దేహంలోని మలినాలను సులభంగా తొలగింపగలం. మనసునందలి మలినాలు అంత సులభంగా తొలగింపలేము.
దాట బూనిన యొక యగాధంపు లోయ
ధైర్య సాహసాలు తనకెంతైన యున్న
అంచె లంచెలు దూకుట యలవి యగునె?
యుక్తమెరిగి వర్తించుటే యోగ్యమగును
ధైర్యసాహసాలు తనలోయున్నాయని అంచెలంచెలుగా లోయలు దూక ప్రయత్నించడం సాధ్యపడదు. ఏది యుక్తమో దాని ననుసరించుటే మంచిదౌతుంది.
దుష్ట సంప్రదాయమ్ములు తొలగ ద్రోసి
మంచి ఆలోచనల నీవు మసలినంత,
లోకు లెల్లరు నిన్ను సుశ్లోకు డనగ
నిగ్గు తేలును నీ లోని నీతి యెల్ల
దుష్టమైన ఆచారాలను వదిలిపెట్టి మంచి ఆలోచనలతో మసలుకుంటే ప్రజలంతా నిన్ను కీర్తిస్తారు. నీలోని నీతికి మరింత వన్నె లభిస్తుంది.
ధనము కోల్పోయి నంత నధైర్యపడకు
రోగపీడిత బాధచే రొష్ఠుపడకు;
కష్టమంతయు పూర్వమే గడచిపోయె
భావి జీవితమింక సౌభాగ్యమగును
ధనం పోగొట్టుకొన్నా, రోగపీడితుడవైనా బాధపడకు, కష్టాలన్నీ గడిచిపోయి రాగల జీవితం సుఖప్రదమవుతుందని భావించు.
ధనము తోడుత సుఖములు దక్కునంచు
అధిక శ్రమ జేయ తనువెల్ల నలసిపోవు;
శిధిలమగునట్టి తద్దేహ చింతవీడి
దైవ సేవలు సల్పిన ధన్యుడౌను
ధనసంపాదన కోసం శ్రమతో శరీరం అలసిపోతుంది. శిధిలమయ్యే శరీరంపై మమకారం వదలిపెట్టి దేవుని సేవించటం వల్ల ధన్యత పొందుతావు.
ధనము నీవద్ద నదనమై తనరు చుండ
కొంచెమైనను పేదల కొరత తీర్ప
పట్టెడన్నము పెట్టి తద్బాధ లన్ని
తొలగ చేసిన చాలును, కలుగు యశము
నీ వద్ద అధిక సంపదలుంటే పేదలకు పట్టెడన్నం పెట్టి వారి బాధలు తీరిస్తే ఎంతో కీర్తి లభిస్తుంది.
ధనము నెంతయో నొందియు, తగిన శాంతి
పొందనేరక జీవితమందు నరుడు
పేదరిక మందె సుఖమును పెంచుకొనును
ఎంత విపరీతమో విధి వింత యాట!
ఎంత ధనమున్నను ఒకేసారి నరుడికి శాంతి లభించదు. తాను పేదగానున్నపుడే శాంతి లభించునని అతడనుకోవటం విధిలీల!
ధనము నెట్లైన గూర్చుటే తగవటంచు
కాలమంతయు వృధచేసి కలతపడక
జీవితము గమియించెడి త్రోవలోనె
అనుభవమ్మును గడియంచు టవసరంబు
కాలమంతా వ్యర్ధంగా గడిపి ధనసంపాదనే లక్ష్యంగా అయిందని కలత చెందరాదు. అనుభవం గడించటం జీవితంలో ఎంతో అవసరం.
ధనము మితిమీరి తనచెంత దాచుకొనిన
చీకు, చింతలు మది నిండి చెరచు నెంతొ;
ప్రాప్త లాభ దృష్టి పరిమితార్జన చేత
కలిగి మనసు శాంతికలితమగును
ధనము ఎక్కువగా ఉన్నట్లైతే చీకు చింత లెక్కువైపోతాయి. పరిమిత సంపాదన వల్ల లాభంతో పాటు మనశ్శాంతి ఉంటుంది.
నడువబోకుము నల్గురు నడుచు బాట
పరుల వెంటను బిరబిరా పరుగు లిడకు;
ముందు నీవుండి, నీ వెంట నందరుంట
నాయకత్వపు ఛాయల నదియె తెల్పు
నల్గురు నడిచే బాటలో నడువవద్దు. గొఱ్ఱెలా ఇతరులను అనుసరింపవద్దు. నీవు ముందుండి నీ వెనుక ఇతరులుంటే నీలో నాయకత్వ లక్షణాలు బయటపడుతాయి.
నిత్యజీవితాన నీ ఆశయా లన్ని,
శ్రమకు నోర్చినంత, సాధ్యపడును;
ఉండవలయుగాదె ఉన్నత సంకల్ప
మేరికైన నెంత వారికైన
శ్రమకు తగినట్లుగా ఆశయాలు నెరవేరుతాయి. ఎట్టి వారికైన గొప్ప సంకల్ప ముండుటెంతో అవసరం.
నిన్ను నవ మాసములు మోసె కన్నతల్లి
పెంచి పెద్దగా చేసెను ప్రేమ తోడ,
నిండు నూరేళ్ళు నీకామె నించె, నట్టి
తల్లి ఋణమును దీర్పంగ తరమె నీకు?
నవమాసాలు నిన్ను మోసి, పెంచి, పెద్దను చేసి నీకు నూరేళ్ళు ఆయువు నిచ్చిన తల్లి ఋణము నీవు తీర్చుకొనలేవు.
నీకు సర్వత్ర కీడునే నెంచు వాని
సంహరింపుము వెంటాడి శక్తిమీర;
నీదు శత్రువు నెదిరించి నిన్ను గాచు
వాని రక్షింప ప్రాణాల నైన నిమ్ము
ఎల్లప్పుడు నీకు హాని తలపెట్టే వాణ్ణి వెంటాడి సంహరించు. నీ శత్రువు నెదిరించి నిన్ను రక్షించే వాణ్ణి నీ ప్రాణాలైనా ఇచ్చి కాపాడు.
నీతి విడనాడి ఏనిష్ఠ నియమములను
తాను పాటింప కన్యుల దరిని జేరి,
వారినిం గూడ ప్రేరేపించు వారి చెంత
చేరరాదది మిక్కిలి చేటు దెచ్చు.
నీతి నియమాలు, నిష్ఠ పాటింపక ఇతరులను కూడా అదే విధంగా ప్రేరేపించు వారిని చేరటం వల్ల చేటు కల్గుతుంది.
నీదు సంపద జూచి కన్నెర్ర జేసి
ఈర్ష్యతో మండిపడెడి వారెవ్వరైన
వారినందరి నేర్పుతో దూరముంచి
మసలుకొనుటయె తగినట్టి మార్గమౌను.
నీ సిరిసంపదలు చూచి అసూయపడేవారికి దూరంగా ఉండటమే తగిన మార్గం అవుతుంది.
నీదుగొప్పలు పదిరెట్లు నీకు నీవె
పదుగురకు చెప్ప బూనుట పాడిగాదు
గొప్ప చెప్పుటె చాలదు కూర్మితోడ
మంచిపనులను జేసి మెప్పంచవలయు
నీ గొప్పలు నీవె చెప్పుకోకూడదు. ప్రేమతో నలుగురికి మంచి చేసి మెప్పించాలి. గొప్పతనం పొందాలి.
నేటి విద్యావిధానంబు నియతి తోడ
కరప గల దొకయింత విజ్ఞాన సరళి
గాని, నిశ్చింతగా బ్రతుకంత గడుపు
పద్ధతి నెవరు నేర్పు నీ ప్రకృతి గాక
నేటి విద్యావిధానం వల్ల కేవలం జ్ఞానం మాత్రమే సంపాదిస్తావు. నిశ్చింతగా బ్రతకటం నీకు ప్రకృతి తప్ప మరెవరు నేర్పరు.
నేరమేమియు గాదది నిర్ణయాలు
విఫలమౌచుంట ప్రతిసారి విధివశాన;
పట్టుదల కొంచెమైనను పరగియున్న
సఫలతను జెందు టెంతొ నిస్సంశయంబు
కొన్నిసార్లు నిర్ణయాలు విఫలమవటం దోషం కానేరదు. పట్టుదలతో కొనసాగితే సఫలమవటం నిస్సందేహం.
పగను తీర్చుట కొరకెంతో తెగువతోడ
మానసికపు టొత్తిడులనే మరచిపోయి
పలుక బోకుము ద్వేషింపు పరుషభాష
వైరిజనులతో చెలిమినే కోరుకొనుము
పగను తీర్చుకోటానికి కఠినమైన పదాలతో ద్వేషిస్తూ మాట్లాడవద్దు. శత్రువుతో చెలిమి చేయటానికి ప్రయత్నిస్తే పగ ఉండదు కదా!
పగను పెంచు కొనగ జగమంత నరునకు
కక్ష గట్టినట్లు కానబడును;
సహన భావమతని శంకలే తొలగించి
సవ్య దృష్టి నొసగు, శాంతి గల్గు
పగ పెంచుకొంటే ప్రపంచమంతా తనకై కక్ష్య కట్టినట్లు కనబడుతుంది. సహనంతో ఉండేవానికి అనుమానాలు తొలగి సరైన దృష్టి ఏర్పడి శాంతి కల్గుతుంది.
పదుగురందున సుఖమునే పంచుకొనిన
దాని రెట్టింపు చేతురు త్వరితముగను;
సగము చేయగలరు నీవిషాదమెల్ల
తోటి వారికి పంచగా పాటుబడిన
సుఖం లభించినపుడు దానిని పదిమందితో పంచుకుంటే రెట్టింపు ఉత్సాహం లభిస్తుంది. అట్లే తోటివారితో నీ బాధలు పంచితే ఆ బాధలు సగం తీరుతాయి.
పరుల నడవడి పలుమారు నరసితత్ప్ర
వర్త నందలి మంచినే భావమందు
దిటవుగా నిల్పి ఆచరించుటయె మేలు
నరుని కద్దియె కల్యాణకరము భువిని
ఇతరుల నడవడి గమనించి వారిలోని మంచినే మనసులో నిల్పి మనం కూడా మంచిపనులు చేస్తే అంతా శుభం జరుగుతుంది.
పరుల నమ్మనివాని నితరులును నమ్మ
రాదనెడిసూక్తి యయ్యది చేదు నిజము;
నమ్మకాలన్ని జగతిలో వమ్ము యగుట
అందరెరిగిన విషయమే యవధరింప
ఇతరులను నమ్మని వారిని ఎవరూ నమ్మరనేది వాస్తవం. కాని నమ్మకాలన్ని వ్యర్ధమవటం అందరెరిగిన విషయమే.
పరుల సొమ్మును స్వాధీన పరచుకొనిన
వారు చేసిన పాపంబు వీరిదౌను;
దొంగతన మనునది మహాదోష మగుట
దానికై పుణ్యులెవ్వరు పూనుకొనరు
ఇతరుల సొమ్మును స్వాధీన పరుచుకొంటే వారుచేసిన పాపాలన్నీ వీరివౌతాయి. దొంగతనం మహాపాపమవటం వల్ల ఎవరూ ఆ పనికి పూనుకోరు.
పరులు కష్టాల పాలైన పరగ కరుణ
చూపి, చేసిన సాయంబు సుంతమైన
మరచి పోకుండు టే మహి మాన్య గుణము;
మరిచి పోయిన వానికి పరువు చేటు
ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు కొద్దిసాయం చేసినా దానిని వారు మరువకుండుటే గొప్ప గుణం. మర్చిపోయే వానికి పరువు లేదని భావించాలి.
వేషభాషలు తెలుపవే వివరముగను
మనసులోనున్న భావాల మర్మమెల్ల;
ఎట్టి ఆందోళనల లొంగనట్టి మనసు
బయట పడనీదు తనలోని భావఝరిని
ఒక మనిషి వేషభాషల ద్వారా అతని నిజస్వభావం బయట పడవచ్చు. ఏ ఆందోళనకు లొంగని మనసులోని భావాలు ఏ మాత్రం బయట పడవు.
పాత జీవితంబు పరమోత్తమంబంచు
బ్రతుకు నట్టివాని బడుగు యంద్రు;
భావి జీవితంపు పధకాల నల్లుచు
బ్రతుక గల్గువాడు భాగ్యశాలి.
గత జీవితమె మంచిదని తలచేవాడిని బడుగు అంటారు. రాగల జీవితానికి పథకాలు వెతుకుచుండేవాడు భాగ్యశాలి అవుతాడు.
పాలతో బాటు ప్రేమను పంచిబెట్టి
చీర చాటున చదివింప చెల్లు తల్లి
తానె బిడ్డకు గురుడును దైవ మౌచు
సార్ధకము చేయు తన జీవసాగరంబు
పాలతో పాటు ప్రేమను పంచుతూ, తన చెంగు చాటున బిడ్డను చదివిస్తూ తానే ఆ బిడ్డకు గురువుగా, దైవంగా తన జీవితాన్ని తల్లి సార్ధకం చేసికొంటుంది.
పులిని నమ్మిన ప్రాణాలు పోవు సుమ్ము,
మరణమే గతి నీటిలో, మకరి నోట;
చేయు వ్యాపారమందున చేయి గలుపు
పరుని గ్రుడ్డిగా నమ్మిన బ్రతుకలేవు.
పులివాతబడి మరణాన్ని తప్పుకోవచ్చు. నీటిలో మొసలికి చిక్కి కూడా మరణం తప్పవచ్చు. వ్యాపారంలో భాగస్వామిని గ్రుడ్డిగా నమ్మి బ్రతకలేవు సుమా!
పుస్తకాలను మెండుగా ప్రోగు చేసి
చదివి నంతనె జ్ఞానమ్ము సాధ్యపడదు;
పుస్తకంబుల విషయాలు మస్తకాన
చేరినప్పుడె నరునకు శ్రేయ మౌను
ఎన్నో పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం సంపాదించలేము. ఆ పుస్తకాల్లోని విషయాలు తలకెక్కినపుడే మేలు కల్గుతుంది.
పూర్ణ చంద్రుడెపుడు భువినెల్ల వెలుగులు
విస్తరించినట్లు విఫలముగను
వంశవృద్ధి జేయు వాడె సుపుత్రుండు;
అట్టి వాని కనుట యధిక పుణ్య ఫలమె
ప్రపంచమంతా పూర్తి వెలుగులు పౌర్ణమినాటి చంద్రుని వల్ల విస్తరిస్తాయి. అదేవిధంగా వంశవృద్ధి చేయగల పుత్రుని కల్గటం పూర్వజన్మ పుణ్యఫలమే.
పెక్కు ఆలోచనల తోడ భీతి చెంది
కుమిలిపోవుచు మదిలోన నమితమైన
చెడ్డ తలపులు చేరంగ చింతపడుచు
వగవ ఫలమేమి, జనులకు దిగులు తప్ప?
అనేకమైన ఆలోచనలతో భయం చెందుతూ మనసులో కుమిలిపోతూ, చెడ్డ ఆలోచనల వల్ల చింతిస్తూ విచారించి ప్రయోజనం లేదు.
పెక్కుమంది జనులు భీతులై తమకంత
శక్తి లేదటంచు జాటు చుంద్రు;
ఉన్న శక్తి నైన నుపయోగ పరచని
వారి పైన జాలి పడగనేల?
చాలామంది తమకు, శక్తి లేదని చాటుకొంటారు. ఉన్న శక్తిని ఉపయోగించలేని అట్టివారిపై జాలి పడరాదు.
పేదరికమందు భగవంతుపేరు దలచి
కష్టముల నెల్ల ఆయన కప్పగించి
ఆప్తుడవు పరమాత్మ కీవైన యెడల
బీదతనమది శాపమే కాదు నిజము
నీవు బీదవాడవైనా కష్టాలను దేవుని కప్పగించి ఆయననే సేవిస్తే నీకు బీదతనం శాపం కాజాలదు.
పేరు లభియించినంతనె పెచ్చరిల్లు
కృంగి కృశియించు, నయ్యది భంగపడిన;
గెలుపు నోటమిన్‌ సమముగా తలచు నరుని
మది తటస్థమై యొప్పారు మహితరీతి
పేరు ప్రతిష్ఠలు రాగానే పొంగిపోయి అవి లేనపుడు క్రుంగిపోవటం మంచిదికాదు. జయాపజయాలు సమంగా భావించ గల్గిన నరుడే గొప్పవాడు కాగలడు.
పొగడి నంతనె మిక్కిలి పొంగిపోకు
క్రొవ్వు నెక్కించు నీకది కొంచెమైన;
నిన్ను గూర్చిన సువిమర్శ లెన్ని యైన
కాని నీకవి కీర్తి సంక్రాంతిపదములు
పొగడ్తకు లొంగిపోతే నీకు క్రొవ్వు ఎక్కువైపోతుంది. కాని నిన్ను గురించిన మంచి విమర్శలు నీకు కీర్తి కల్గిస్తాయి.
ప్రాప్త మైనచో సుఖమున పరవశించి,
దుఃఖ సంఘటనల కల్గు దోషమెంచి,
దైవమును దూరుటది ఎట్టి ధర్మమౌను?
భువి శుభా శుభకర్మలు భోగ్యమెపుడు
సుఖాలతో ఉన్నప్పుడు పరవశం చెంది, దుఃఖాలు కల్గినపుడు తప్పులెన్నుచూ దేవుని దూషించటం భావ్యం కాదు. శుభా శుభాలు రెంటిని సమానంగా అనుభవించటం నేర్వాలి.
బరులు చెప్పిన దంతయు ఒప్పటంచు
వారు నుడివిన విధముగ మారినంత;
తనదు వ్యక్తిత్వ మంతయు తప్పు త్రోవ
పట్టుటాతని కెట్టి దౌర్భాగ్య మకట!
ఇతరులు చెప్పినదంతా ఒప్పేయని, వారు కోరిన విధంగా మారిపోతే మనిషిలోని వ్యక్తిత్వము తప్పుద్రోవ పట్టటం ఎంతో దౌర్భాగ్యం!
బిడ్డ జనియింప శుభమంచు పెద్దపెట్టు
దీర్ఘకాల మానందాన తేలిపోయి
సుగతి పొందంగ దుఃఖాన సోలిపోవు
టెంత చిత్రము విధిలీల లెంచ వశమె!
బిడ్డపుట్టినప్పుడు శుభమని పొంగిపోయేవారు వయసు మారిన పిమ్మట మరణం చెందితే దుఃఖాన మునగటం విధి లీల.
భయము నెరుగని వాడు నిబ్బరము తోడ
జయము పొందును లక్ష్యపు జాడ నెరిగి;
భయము చేతనె సందేహ పడెడి వాడు
నెట్లు ఛేదించు లక్ష్యంపు టెరుక లేక
భయం తెలియనివాడు ఎంతో ధైర్యంతో లక్ష్యాన్ని ఛేదించి జయం పొందుతాడు. భయంతో సందేహించేవాడు ఏ విధంగాను లక్ష్యం సాధించలేడు.
భరతునకు రాజ్యపాలనా భారమొసగి
అడవులకు వెళ్ళె శ్రీరాము డతివ తోడ,
తండ్రి యాజ్ఞను తలదాల్చు తనయుడౌట
పేరు గాంచెను పితృభక్తి సౌరునందు
భరతునకు రాజ్యపాలన అప్పగించి సతీసమేతంగా శ్రీరాముడడవులకెళ్ళాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించుట వలననే ఆయనకు పితృవాక్యపాలకుడనే పేరు లభించింది.
మంచి పనుల మనుజు డించుకేనియును తా
చేయలేక భువిని చేష్టలుడుగ,
అంతకంటెను మంచి ఆలోచనల తోడ
సులచేరీతి చేయ చోద్యమగును
మంచి పనులు చేయలేనివాడు తనయశక్తతకు నిశ్చేష్టుడగును. దానినే సరైన విధంతో ఆలోచించి సులభంగా మరొకరు చేయుటెంతో విచిత్రం.
మంచి వ్యక్తి యంచు మనసార పెండ్లాడి
జీవితాన తృప్తి చెందవలదు,
బ్రతుకు బాటలోన పరమహితము గోరు
వారి నెన్నుకొనుటె వరగుణంబు
మంచి వ్యక్తితో పెండ్లి జరిగినదని ఎవరూ సంతోషంతో పొంగిపోరాదు. ఇరువురి బ్రతుకు బాటలో హితము జేయు వారినే ఎన్నుకొనుట మంచిది.
మంచిదైనట్టి తలపుల మర్మమంత
స్నేహితుల కెల్ల తెల్పుట శ్రేయమౌను;
అట్లు కాకుండ మదిలోన నణచి యుంచి
కుమ్మ బెట్టుట జనులకు కూడదెపుడు
మంచి ఆలోచనలు స్నేహితులతో పంచుకొనుము. అంతే కాని వాటిని మనసునందే అణచి యుంచటం ఎవరికీ కూడదు.
మంచివారిని నీచెంత నుంచుకొనుము
దుష్టులను పెట్టగాదగు దూరమందు;
శాంతి సుఖముల నరుడు విశ్రాంతి చెంద
నేర్చుకొనుటకు నుచితమీ నీతులెల్ల
నీవెప్పుడూ మంచివారల చెంత ఉండు. దుష్టులకు దూరంగా ఉండు. శాంతిసుఖములు కల్గుతాయి.
మనసులో మంచి భావాలె మాటలగుట,
చేరి మాటలు క్రమముగా చేత లౌట,
చేతలన్నియు నలవాట్లు చేసికొనుట,
శీలమును పెంచి నరునకు మేలు చేయు
మనసులో ఉండే మంచిభావాలు మాటలుగా, మాటలే చేతలుగా, చేతలే అలవాట్లుగా క్రమేణా మారటం వల్ల మానవుని శీలం పెరిగి మేలు కల్గుతుంది.
మనిషి సంసార మందుంట మంచిమాట
యనెడి సూక్తికి నర్ధంబు గనుట కొరకు
నీరనిధి వోలె కలగు సంసారమందు
మనిషి యుండెడి వైఖరి మానవలయు
మనిషి తన సంసారం గురించి పట్టించుకోటం మంచిదేకాని సంసార సాగరంలో మునిగిపోయే వైఖరి ఉండరాదు.
మను జులందున యుండును మంచి చెడులు;
నేల యొకటైన మాత్రాన నీటి తీరు
తీపి, ఉప్పుల రుచిచేత తెలియగలదు
దైవలీలల నెరుగంగ తరమె మనకు?
మనుష్యులలో మంచిచెడులుండటం ఒకే నేలలో తీపి, ఉప్పు ఉండటం, దైవలీలయని తెలిసికోవాలి.
మరణమాసన్నమైనను మనిషి చింత
చెందు - తనవారి వీడుచున్నందు వలన;
చావు తప్పదు నరునికే సరణినైన
యనెడి జ్ఞానము కల్గబోదట్టి వేళ
తనవారినందరిని విడిచిపోతున్నందుకు మరణ సమయంలో మనిషి బాధపడతాడు. ఆ సమయంలో ఏ నాటికైన చావు తప్పదనే జ్ఞానం అతనికి కల్గదు.
మరణమునకైన సిద్ధమై వెరవకుండ
ప్రసవ వేదన నెంతొ నిబ్బరము తోడ
తాను భరియించి బిడ్డకు ప్రాణమిచ్చు;
తల్లి మించిన మరియొకదైవ మెవరు?
మరణ భయం లేకుండా ప్రసవ వేదన ధైర్యంగా భరించి బిడ్డకు ప్రాణమిచ్చే తల్లి కంటే మరో దైవం లేదు.
మాట వదలిన నయ్యది మరల రాదు,
వదలి పెట్టిన యవకాశ మదియు రాదు;
రాదు విడచిన బాణంబు క్రమ్మరింప,
కాలమదికూడ రాదుగా గడచిపోవ
పలికిన మాట, చేజేతులా వదలు కొన్న అవకాశం, వింటి నుండి విడిచిన బాణం తిరిగి రానట్లే, గడిచిన కాలం రాదు.
మారవలయును చేతలు, మాటలన్ని
కలియుగంబున వానిచే కలుగు మేలు,
ఎట్టి విధమున మారలేనట్టి వారి
జన్మ వృధ యంచు దలపరే జనులు ఎల్ల?
మాటలు, చేతలు ఎప్పటికప్పుడు మార్చుకోవటం వల్ల ఈ కలియుగంలో మేలు కల్గుతుంది. ఏ విధంగాను మారలేని వ్యక్తుల జన్మ వ్యర్ధమని ప్రజలు తలుస్తారు.
మార్పు లేదైన సులువుగా మలచు కొనుట
సమయపాలన వలననే సాధ్యమగును;
సమయపాలన చేతనే సకల జనులు
కరము సంస్తుత్యమానులై పరగగలరు
సమయపాలన వలన అవసరమైతే తగిన మార్పులు చేసుకోవటానికి సాధ్యమౌతుంది. సమయపాలన నియమంగా పాటించే వారే అందరిచేత స్తుతింపబడుతారు.
ముసలితనమున మాత్రమే మ్రోల జేరి
దేవదేవుని తలచెడి దీక్ష బూని
నడుచుకొనవాడ, నీ నీడ నమ్ము మనెడి
నరుడు జీవన యాత్ర కనర్హుడగును
ముసలితనంలో మాత్రమే దేవుడా నిన్నే నమ్ముతున్నాను నీనీడన నడుస్తాను అనేవాడు జీవించటం వ్యర్ధం.
మొక్క యెక్కటి మాలికి దక్కినంత
పెంచు నతడుదాని మహావృక్షముగను
శిశువు నారీతి తల్లియు క్షేమ మొప్ప
తీర్చి దిద్దును దీక్షతో ధీయుతునిగ
చిన్నమొక్కను తోటమాలి నాటి పెద్ద వృక్షంగా పెంచుతాడు. ఆ విధంగా బిడ్డను తల్లి కూడా తీర్చి దిద్దుతుంది.
మొట్టమొదటిది యౌవన, మట్టి దాని
నీడ పదవి, యజ్ఞానము, తోడు కాక
ధనము, మదములు కూడిన మనుజు డిట్లు
నైదు విధముల పతనమ్ము నందు సుమ్ము
యౌవనము, పదవి, యజ్ఞానములకు తోడుగా, సంపద, అహము చేరితే ఆ ఐదింటి వల్ల పతనం చెందుతారు.
మొదలు పెట్టిన యత్నంబు తుదకు విడిచి
వేరు యత్నాలు చేయుటే పిరికి తనము;
ప్రాణ మెద్దియు పాయక యత్నములను
చేయువా ఓయిల ఘను, డజేయు డగును
ఒక పని మొదలు పెట్టిన తర్వాత విడిచిపెట్టి వేరు ప్రయత్నాలు చేయటం పిరికితనం అవుతుంది. ప్రాణం పోయినా సరే, తలపెట్టిన కార్యం పూర్తిచేయగలవాడే గొప్పవాడవుతాడు.
లభ్యమైనది కొంత సలక్షణముగను
తోటివారికి పంచెడి త్రోవమేలు
మనకు నున్నంతదానితో మనుట చేత
ముదము కల్గును జీవన పథము నందు
తనకు లభించినదానితో సర్దుకుని పోవుటచే జీవితమెంతో సుఖప్రదమగును.
వయసు మీరిన వృద్ధులౌ వారి తోడ
యుండదగుగాదె ఈ నాటి యువత యెల్ల;
ముసలితనమది త్వరితమ్ము ముసురుకొనుట
యువత నిర్లక్ష్య ధోరణి నుంట గాదె?
నేటి యువత ముసలివారికి తోడుగా ఉండవలెను. నిర్లక్ష్యము చేసినచో పిన్న వయసులోనే వృద్ధత్వమేర్పడును.
విందు నిచ్చునపుడు వింతచేష్టలు మాని
చిన్నదైన నవ్వు చింద నిమ్ము;
అమృతధార లౌచు ఆచిరునవ్వులే
ఆదరించు అతిధి నట్టి వేళ
ఏదైన పార్టీ ఇచ్చేటప్పుడు చిన్న నవ్వు ముఖంలో కనబడాలి. ఆ చిరునవ్వే అతిధులకు అమృత ప్రాయమనిపిస్తుంది.
విజయమందిన మగవాని వెనుక నెపుడు
నొక్క మగువైన తప్పక యుండు నంట!
ఆత డపజయ మందిన యట్టి వేళ
వాని వెనుకంట నెందరు వనితలుండ్రు?
ప్రతి మగవాని విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. అతనికి అపజయం కల్గితే దాని వెనుక ఎందరు స్త్రీలుంటారు?
వినయశీలుని గనినంత వేడ్కకొరకు
చూపకూడ దహంకార సూత్రమీవు;
వినయశీలత చూపిన వేగిరమ్ము
అహము నీనుండి యప్పుడే అణగిపోవు
వినయంగా ఉండేవాణ్ణి చూసి అహంతో ప్రవర్తించకు. వినయం చూపితేనే నీలోని అహం అణగిపోతుంది.
వేషభాషలు తెలుపవే వివరముగను
మనసులోనున్న భావాల మర్మమెల్ల;
ఎట్టి ఆందోళనల లొంగనట్టి మనసు
బయట పడనీదు తనలోని భావఝరిని
ఒక మనిషి వేషభాషల ద్వారా అతని నిజస్వభావం బయట పడవచ్చు. ఏ ఆందోళనకు లొంగని మనసులోని భావాలు ఏ మాత్రం బయట పడవు.
వైర ముండిన వానినే చేరగల్గి
పగను త్రుంపినవాడె శుభాస్పదుండు;
రోషమును పెంచుకొనుటయె దోషమౌట
దాని విడనాడు విధమునే దలపవలయు
శత్రువుపై పగను మర్చిపోయి వానితో చెలిమి చేయువాడే మంచివాడు. రోషం పెంచుకోటం దోషమే కనుక దాన్ని వదిలిపెట్టాలి.
శక్తి చాలనపుడు శత్రువుల్‌ ఎదురైన
తలను వంచుకొనుట తగిన దౌను;
తీరు మారకుండు తీవ్రమౌ గాలికి
వంగి గడ్డి పరక భంగపడిన;
తనకు శక్తి చాలనపుడు శత్రువెదురైతే తలవంచుకొని పోవటం మంచిది. తీవ్రంగా గాలి వీచినపుడు గడ్డిపరక వంగిపోయి మరల యధాస్థితికి చేరుకోదా!
శక్తులన్ని చేర్చి శ్రద్ధతో పనిపూర్తి
చేసినంత కల్గు సిరుల రాసి;
బద్ధకస్తు డౌట పరమ దరిద్రంబు
నాతడనుభవించు ననుట నిజము
శ్రద్ధతో ఏ పని చేసినా సిరుల రాసి లభిస్తుంది. సోమరితనం వల్ల దరిద్రం మాత్రమే లభిస్తుంది.
సత్యమును బల్కు మెటులైన నిత్యజీవ
శైలి యందున అయ్యదే సైచు నిన్ను
అట్టి సత్యంబు మరచిన హాని కల్గు
చెప్పబోకు మసత్యము గొప్పకొరకు
నిత్యజీవితంలో సత్యం పలకటానికి ప్రయత్నించాలి. అదే నీకు జీవనరక్ష. గొప్పకోసం అసత్యం చెప్పినా హాని తథ్యం.
సత్యవాక్కును పల్కుటే సమ్మతంబు,
ధర్మ మార్గాన నడుచుటే తగిన రీతి,
యనెడి పెద్దల మాటల నాచరింప,
శాశ్వతంబౌను నీయింట శాంతి సుఖము
సత్యమే పల్కాలి, ధర్మంగా నడవాలి అనే పెద్దల మాటలు ఆచరిస్తే ప్రతి ఇంట శాంతి, సుఖములుంటాయి.
సాగరానసైతము దూకు సాహసునకు
దొరకి తీరును తప్పక సిరుల రాసి;
అంతియే గాక ధైర్య శూరాగ్ర శూరుడ
తండనెడి కీర్తి గల్గును తరచి చూడ
సముద్రంలో దూకే సాహసికి తప్పకుండా సిరులరాసి లభిస్తుంది. అంతేగాక ధైర్యవంతుడు శూరుడు అనే కీర్తి కూడా లభిస్తుంది.
సానుభూతిని దెల్పెడి సరసవాక్కు
లెన్ని యైనను బల్కుట కన్న, తాను
చేయగల్గిన సాయమ్ము చేసినంత,
నదియె ఇతరుల హృదయాల నలరజేయు
మాటసాయం మాత్రమే చేయటం కంటే, చేతనైన సాయమందించినపుడే ఇతరుల హృదయాలను మెప్పించగలవు.
సిరుల ననుభవించుచు నీవు శేషధనము
బడుగు జీవుల గమనించి పంచి యుమ్ము;
పస్తులుండెడి పేదల బ్రతుకు లందు
జీవితాశను గల్గించి చెలగనిమ్ము
నీవు సిరులననుభవిస్తూ పేదలను గమనించి వారికి కొంతధనం పంచు. ఆకలితో అలమటించేవారి బ్రతుకుల్లో జీవితాశను కల్గించినవాడవౌతావు.
సేవ లొంటరిగానుండి చేసినంత
మనసు లగ్నంబు సల్పు సన్మార్గ మౌను;
బాధపడబోక మొంటరి బ్రతుకటంచు
దైవమును తలచుకొను మెంతైన భక్తి
ఒంటరిగా ఉంటూ మనసు లగ్నంచేసి సేవలు చేయుటే మంచి మార్గం. ఒంటరిగాడనని బాధపడక మిక్కిలి భక్తితో దైవమును స్మరింపుము.
సోమరి తనాన ప్రగతియే శూన్యమగును
జాతి ఎల్లను పతనమౌ నీతి మాలి;
అట్టి తరుణాన సుజనుల నాశ్రయించి
దేశ భవితను దిద్దుమీ దీక్ష బూని
సోమరితనం వల్ల ప్రగతి మార్గం ఉండదు. జాతి మొత్తం నీతిమాలి ప్రవర్తిస్తే పతనమౌతుంది. ఆ సమయాన సజ్జనుల నాశ్రయించి దీక్షతో దేశ భవిష్యత్తు దిద్దాలి.
స్వచ్ఛజలముల స్నానమ్ము సల్పినంత
ఒడలిపై నుండు మలినాలు కడుగనగును
దైవభక్తి యన్‌ తీర్ధాన తానమాడ
మనసులో నుండు మలినాలు మాయమగును
స్వచ్ఛమైన నీటిస్నానం చేస్తే శరీర మలినాలు తొలగిపోతాయి. దైవ భక్తి అనే తీర్ధంలో స్నానం చెస్తే మనసులోని మలినాలు తొలగుతాయి.
హాని పరులకు తలపెట్టు వానికిలను
తగిన శాస్తియె జరుగుట తప్పదెపుడు
ఎవరు తీసిన గోతిలో నెల్లవేళ
వారె పడుదురనుట యొక వాస్తవంబు
ఇతరులకు కీడు తలపెట్టే వాడికి తగిన శాస్తి జరుగుతుంది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు కదా!
హింస ప్రతిహింసలను బూని హితము వీడి
జయము సాధింపగోరుట నయము గాదు;
కంటి లోపలి నలుసును గెంటి వేయ
ముల్లు చేబూని కెలుకుట మూర్ఖమౌను
హింసకు ప్రతిహింసే మార్గమని తలచి జయము సాధించాలనుకోటం మంచిది కాదు. కంటి లోపలి నలుసును తీయటానికి ముల్లుతో కన్ను కెలకటం మూర్ఖత్వం అవుతుంది.