Thursday, January 26, 2017

thumbnail

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - Happy Republic Day 2017

రాజ్యాంగం మంచిదే కాని మంచి వారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది” —అంబేద్కర్.

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నాడు.

ప్రజా స్వామ్యానికి మూల గ్రంథం లాంటిది మన రాజ్యాంగం.

మరి మన రాజ్యాంగం గురించీ,గణతంత్రం గురించీ కొన్ని విషయాలు….

రాజ్యాంగం రాత ప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు..

“భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము,

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం ,ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, హోదాలోను, అవకాశాలలోను సమానత్వం, వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము. 

1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము…..”

Republic day 2

భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించింది. ఫలితంగా అందివచ్చినదే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగం.

భారత దేశాన్ని సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యింగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్‌)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్‌, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్‌ రాజ్యాంగం..
  • స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
  • రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
  • రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
  • భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
  • 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.
  • 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
  • మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. 
  • మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.
  • 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేఛ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. 
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి.
  1. ఏక పౌరసత్వం   —  బ్రిటన్
  2. పార్లమెంటరీ విధానం — బ్రిటన్
  3. స్పీకర్ పదవి  —  బ్రిటన్
  4. ప్రాథమిక హక్కులు  — అమెరికా
  5. సుప్రీం కోర్టు  —  అమెరికా
  6. న్యాయ సమీక్షాధికారం  —  అమెరికా
  7. భారతదేశంలో ఆదేశిక సూత్రాలు  —  ఐర్లాండ్
  8. రాష్ట్రపతి ఎన్నిక పద్దతి  —  ఐర్లాండ్
  9. రాజ్యసభ సభ్యుల నియామకం  —  ఐర్లాండ్
  10. భారతదేశంలో ప్రాథమిక విధులు  —  రష్యా
  11. కేంద్ర రాష్ట్ర సంబంధాలు  —  కెనడా
  12. అత్యవసర పరిస్థితి  —  వైమర్(జర్మనీ)
ఇలా ఎన్నో దేశాలు,మరెన్నో గ్రంథాలు.. ఎన్నో జాతుల జీవన విధానాలనూ పరిశోధించి ఏర్పరుచుకున్న భారత పరిపాలనా మార్గదర్శ గ్రంథం ఆమోదం పొందిన రోజు… స్వతంత్ర్యానంతర భారత దేశం రాజకీయంగా తన కంటూ ఒక స్వంత అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నరోజు. గణతంత్ర దినోత్సవం. దేశ సమగ్రతని కాపాడాల్సిన భారత పౌరులమైన మనం ఇంకొక్కసారి మన విజయాని గుండెలదిరేలా “మేరా భారత్ మహాన్” అని ప్రపంచానికి చెప్పే రోజు….  రామ్ కర్రి .కామ్ నుంచి మీకూ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.