Sunday, February 07, 2016

thumbnail

Small Story

కుండ కోరిక...ఒక చిన్న కథ


ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేసాడు.


అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చి కుండల్లో ఒక దానికి చాలా భయం వేసింది.

"అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు దయచేసి నన్ను కాల్చొద్దు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది అని దీనంగా కుమ్మరిని బతిమాలింది.

కుమ్మరి కుండతో 'జీవితంలో తొలిదశలో కష్ట పడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండి పోతే నీ జీవితం వృధా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావూ' అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు.

అతడు ఎంత చెప్పినా వినకుండా మొండికేసింది. సరే అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు.

ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు ఆనంద పడుతూ, 'నాకా బాధలు లేవు హాయిగా ఉన్నానూ' అనుకుంది ఆ పచ్చి కుండ.

బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది.

కుమ్మరి కొన్ని కుండలో నీళ్లు నింపాడు.కొన్ని కుండల్లో మట్టి నింపి మొక్కలు నాటాడు. 

తనకా బరువులు లేనందుకు ఆనందించింది ఆ కుండ.

ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ ధృడంగా అలాగే ఉంటే ఈ పచ్చి కుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది.

కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరి క్షణంలో బోధ పడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments